తెలుగువారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి అమరజీవిపొట్టి శ్రీరాములు🍁🌻🍁
తెలుగువారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఉండాలి, తెలుగు వారంతా ఒక రాష్ట్రం కింద ఉండాలని తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగా ఏర్పడిన నాటి ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా శుక్రవారం కావలి పట్టణంలోని ట్రంకు రోడ్డులో గల శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి పొట్టి శ్రీరాములని అన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఉండాలని, తెలుగు వారంతా ఒకచోట ఉండాలని పొట్టి శ్రీరాములు కృషి చేశారని తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగ ఫలితంగా 1956 నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, నాటి ప్రభుత్వాలు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరపటం జరిగిందని తెలిపారు. జరిగిన పరిణామాల్లో తెలంగాణ, ఆంధ్ర విడిపోయిన తరువాత జూన్ 2న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం గా నిర్వహిస్తున్నామని తెలిపారు.
భారత దేశ చరిత్రలో భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం 56 రోజులపాటు ఆమరణ దీక్ష చేపట్టి అమరుడైన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని అన్నారు. ఆయన దహన సంస్కారాలకు సైతం ఎవరూ ముందుకు రాని సమయంలో సాధు సుబ్రహ్మణ్యం, ఘంటసాల వెంకటేశ్వర్లు పిలుపుతో లక్షలాదిమంది జనం మద్రాసు కు విచ్చేసి అంతిమ సంస్కారాల్లో పాల్గొనడం జరిగిందని తెలిపారు.
పొట్టి శ్రీరాములు ఆశయాలను పుణికి పుచ్చుకొని తెలుగు వారు తలెత్తుకునే విధంగా తెలుగు భాషను రెండవ ప్రాధాన్యత భాషగా నిలబెట్టిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగువారి విలువను ఎన్టీఆర్ పెంచారన్నారు.
ఈ కార్యక్రమంలో కావలి ఆర్యవైశ్య అధ్యక్షులు తటవర్తి రమేష్, టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, తిరివీధి ప్రసాద్, అర్షియా బేగం, కోట రమేష్, తటవర్తి వాసు, ఆర్యవైశ్య నాయకులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు